సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ లింక్ పై క్లారిటీ..

న్యూఢిల్లీ : సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం స్పష్టం చేశారు. ఆధార్ సమాచారం పూర్తి భద్రతతో కూడుకున్నదని దీనిపై తరచుగా ఆడిటింగ్ జరుగుతుందని పార్లమెంట్ లో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఐటీ చట్టం సెక్షన్ 69 ఏ కింద ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు. 2016 నుంచి 2019 వరకూ ప్రభుత్వం దాదాపు 8500 వరకూ యూఆర్ఎల్లను బ్లాక్ చేసిందని వెల్లడించారు. కాగా ఇజ్రాయిల్‌కు చెందిన స్పైవేర్ భారత్ కు చెందిన 121 మంది ఫోన్లను ఎటాక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం గుర్తించిందని, తమ పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి పేర్కొన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి వాట్సాపు పూర్తి నివేదిక కోరామని మంత్రి చెబుతూ పౌరుల ప్రయివేటు డేటా సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురానుందని వెల్లడించారు.